Wednesday, October 17, 2012

ఎందుకంటే.... నేను "కవి"ని

అన్యాయాన్ని సహించలేను...
ఆవేశాన్ని ఆపుకోలేను.
కాగితాలపై కొలువుతీరిన
అక్షరాన్నై ఆవిష్కృతమౌతాను!

లిక్కరు కిక్కు లో ముంచిన
ఆలోచనల్ని కళ్ళాపిచల్లి
దానిపై తీరిగ్గా
"తూలుతున్న జనజీవనం" అని
ముగ్గులేసి మురుస్తాను

ఆకలిని గూర్చి రాసుకుంటూ..
నా Order ఏది అని అరుస్తాను,
పేదరికాన్ని గురించి మాట్లాడుతూ...
నాకు ఎదురయ్యే వారి బట్టల వాసనల్ని
తప్పుకుంటూ జారుకుంటాను !

కనులతో కామించి,
కలంతో ప్రేమిస్తున్నానని..
అబద్దాలాడిస్తాను!

చలిలో వణికి పోయే...
రోడ్డు మీది దేహాన్ని..
అమాంతం కనులతో తినేసి..
అరిగిన ఆలోచనల్ని అందంగా విసర్జిస్తే..
మూడడుగుల పట్టు శాలువా నా భుజాన...
చప్పట్ల మధ్య మురిసిపోయింది...
ఆ అబద్ధాన్ని మోసుకుంటూ మళ్ళీ..
ఆ చలిలో వణికే తనువుల ముందునుంచే వెళ్తాను...
ఎందుకంటే....
నేను "కవిని"
"క"నిపించని "వి"కారాన్ని !!!!!!

మానవత్వానికి సుస్తి చేసింది!

1.
అభం శుభం తెలియని పిల్లల,
బలపాల క్రింద నలిగి పోయే అక్షరాలకు...
ఎవ్వరికీ వినపడని రోదన తట్టి తట్టి పిలుస్తుంటే..
ఎవరిదా ఏడ్పు?? అన్న ప్రశ్నకు...సమాధానం,
లీలగా వింపించింది ఓ కనికరం లేని స్వరం,
మాటలను వృదాగా తోడిపడేస్తూ...
..............
"ఎవరో తెలుగు తల్లట!
కాన్వెంటు ముందు ఏడుస్తుంది..... (నరేష్ కుమార్)"

2.
చిందర వందరగా పడిపోయిన జ్ఞాపకాలలో,
రేపటి వెలుగుని చూడని నిన్నటి రాతిరినై...
ఈసారైన ఓ సందేశం అందుతుందని!
ప్రతి అలనూ చదివిచూసే తీరాన్నై..
నీ మాటకోసం వేచివున్న నన్ను వదిలేసి,
జ్ఞాపకాల మద్యనుంచి వెళ్ళేందుకు తటపటాయిస్తున్న,
నీకోసమే....
.............
"కన్నీటితో నీ దారిని
శుభ్రం చేశా...నిర్భయంగా వెళ్ళు" ........."మెర్సీ మార్గరెట్"

3.
క్షణాల్లో మారిపోయే జీవితాలే అయినా..
ఎప్పటికప్పుడు రాబొయే రేపటికి,
కలల గదిలో ఆశ్రయమిచ్చి...
ఆశల బీరువాలో దాచిన,
కోర్కెల నగలతో ముస్తాబు చేసి..
మురిసిపోతూ కలల గడప దాటి,
ఒక్క సారిగా నిజోదయాన్ని చూసి...
తెలవారగానే మళ్ళీ విసిగిపోయిన మనిషీ..
ఒక్కసారి నిజాన్ని తొడుక్కొని చూడు
.........
"విసిగి వేసారడమంటే...
నిన్నటి జీవితాన్నే మళ్ళీ తొడుక్కోవడం!!!.........."క్రాంతి శ్రీనివాస రావు గారు""

4.
ప్రేమ అన్న రెండు అక్షరాల మధ్య,
దారేలేనట్లు ఇద్దరమూ ఒకటై కలిసి నడిచిన..
నిన్నటిలోంచి అమాంతం బయట పడి!
నీదారి నీది - నాదారి నాది,
అన్న మాటలు పడ్డ చోట,
దహించుకు పోతున్న తిరిగి నన్ను చేరిన నువ్వు,
మళ్ళీ అడుగుతున్నావా కలుద్దామని...
సరే నువ్వే చెప్పు నిజాయితీగా...
...............
"ఎక్కడ కలుద్ధాం! విడిపోయిన దగ్గరేనా????........."వంశీధర్ రెడ్డి""

5.
నిజన్ని క్రింద పరుచుకుని నిశిని కప్పుకొని,
భ్రమల్లో నీలోకి చేరిన విత్తనానికి..
కాలమనే నీరు తాకి బయటపడిన
రక్తావతారాన్ని కర్కశంగా విసిరేందుకు,
నీలా ఎందరో సిద్దపడారు కాబట్టే!
.................
"కన్న ప్రేమ తరిమేస్తుంటే
చెత్త కుప్పలు తల్లులు అవుతున్నాయి."........"అనిల్ డ్యాని"

Friday, June 22, 2012

ఏమయింది! ఏమయింది!

నన్ను తాకిన పరిమళానికి,
మల్లె తనువులు ముద్దులిడెనా..
మత్తు మత్తుగ హత్తుకుంటూ,
మైకమై నా మీద వాలెను!
నిన్ను వెతుకగ నన్ను తరిమి,
నీడలా నా వెంట వచ్చెను,
ఏమయింది! ఏమయింది!
నిన్ను చూడగ నాకేమయింది!

ఎంత కాలము ముస్తాబు చేస్తివో..
నా కంటపడెను నీ చూపు హొయలు!
చూడమంటూ నా భుజము తడుతూ..
చూడగానే సిగ్గంటూ దాగుతు,
అల్లరెంత చేసినాయో...అలసిపోయిన మనసుకెరుక.
ఏమయింది! ఏమయింది!
నిన్ను చూడగ నాకేమయింది!

****** నచ్చితేనే కామెంట్ వ్రాయండి...
 

Tuesday, May 8, 2012

లెక్కలన్నీ పూర్తయ్యాయా..!


విడిపోయేందుకు సిద్దపడ్డావ్!
నీ చూపుల కిరణాలు తాకి,
చివురించిన మది పుష్పం!
వాడిపోతే నీకేంటని,
తిరిగి రాని కాలంలా!
నన్ను దాటి వెళుతున్నావ్...

ఆశ నిరాశల మధ్యన,
జ్ఞాపకాల రాశులలో!
నిన్ను వెతకమని చెప్పి,
నన్ను ఒంటరిని చేసి...
అమావాశ్య వెన్నెలవై,
ఏ కలువను మురిపిస్తావో??

సమీపించిన సమీరమా...
అలరిస్తావని ఆహ్వానిస్తే,
వడగాలివై నను కావలించుకొని!
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే,
రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకవై...
నువు విడిచిన గొంగలిని నాపై కప్పి..
బాధించే జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చెళ్ళావా!!!
 

Monday, May 7, 2012

అబద్దాల చిరునామా!


నా నమ్మకాన్ని అమ్ముకున్నావా!
....
ఆశలతో నిర్మించిన అందాల లోకాన్ని...
సుదూర ప్రేమ తీరానికావల విసిరేసి..
వాడిన నవ్వులతో నిత్యం పలకరించే..
నీ నవ్వు అబద్దం!
కనుల మాటున నిజాన్ని దాచి,
నన్ను మాయ చేసిన నీ చూపబద్దం!
నీవు చేసిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు.
నువ్వేది చెప్పినా నమ్మే మనసు,
నీ మాయలోంచి బయటపడి...
ఎడతెరిపిలేని కన్నీటి వర్షం లో తడుస్తున్నా...
పట్టించుకోని నువ్వబద్దం!
 

Wednesday, April 18, 2012

బాటసారి...


చేజిక్కిన సంతోషాన్ని జారకుండా అందుకుని,
నీ జ్ఞాపకాలను మూటకట్టి,
భుజానేసుకు సాగిపోయే బాటసారిని నేనే!
చెప్పకుండా వెళ్ళిపోతూ నాకో వదిలెళ్ళిన,
అడుగుల జాడలు వెతుకుతు,
పగలనకా....రేయనకా...
మజిలీలను దాటుకుంటు,
నీకోసమే వస్తున్నా...
జాడలేని జాబిల్లి!
అమావాస్య వీడి నువ్వు,
నన్ను చేరు వెన్నెలవై..



Wednesday, February 1, 2012

దాగుడుమూతలు


నిన్ను నే చూసిన క్షణాన,
పూలవాన నీపై కురవలేదు!
పండు వెన్నెల నిన్ను చూసి పారిపోనూ లేదు!
వెలుగు వెలిసిపోలేదు!
ఇంద్రధనుస్సు విచ్చుకోలేదు!
ఆకశాన ఆ నక్షత్రాలు నీ కనులలో ప్రతిబింబించలేదు !
అమాంతం ఓ వెలుగు నను చేరనేలేదు!
కా...
నీ...
నిన్ను చూసి వెళ్ళిన రాత్రి.
నా ఊహలలో పైన చెప్పిన ప్రతిదీ..
ఒక్కొక్కటి గా నా కనులలో ఆవిష్కృతమై,
కనులు తెరిచేముందు అస్తమించాయి,
మరుక్షణం కనులు మూసినా...
నీ తలపులే ఉదయిస్తాయి.
కనులు తెరిచేవరకూ వెళ్ళనని మారాంచేస్తాయి.

Tuesday, January 31, 2012

" హులక్కి "


ఏమిటో యీ విచిత్రం
తిని మిగలంగా పారేసే అన్నం కోసం ఎదురు చూసే పేదబ్రతుకులు,
రేపటికోసం ఎదురు చూడని మొండి మనుషులు,
సిమెంటు చాపలు-చిరిగిన దుప్పట్లు-మాసిన సంచులు,
ఎందుకో ఇంత వైరుద్య జీవన విధానం,
ఏమిటో వారిని కమ్మిన వైరాగ్యం.
ఆలోచనలు కదలటం లేదు,
వారి మోములే కనులముందు మెదులుతూ వున్నయి,
ఏమి చేయలేమా?
ఒక్కరోజుతో సరిపెట్టటం కాదు,
ఒక్కొక్కరినీ సమ్మూలంగా మార్చివేయటం.
ఆ క్షణాన మోముని వికసింపజేసే చిల్లర తప్ప ఏమీ అడగరా?
మమ్మల్నీ మనుషుల్లా బ్రతకనివ్వండని ఎవ్వరినీ వేడుకోరా?
అయినా వారడిగితే ఇచ్చేదెవరు?
వారి కోర్కెలని తీర్చేదవరు?
వారి బ్రతుకులు ఎన్నటికీ హక్కులు లేని హులక్కి బ్రతుకులే!!!

Monday, January 30, 2012

"What is Love"



నేపడుకున్నా నీచుట్టూ తిరిగేనా ఆలోచనలు మెలుకువతోనే వుండటం,
నీధ్యాసలో పడి నేనేమిచేస్తున్నానో కూడా తెలుసుకోలేకపోవటం,
ఒక్క క్షణం నువ్వు నాముందుంటే తిరిగి న్వ్వు కనిపించేవరకు ఆ జ్ఞాపకాన్ని మదిలో భద్రంగా దాచటం,
నీ నీడగా మారేందుకు ప్రయత్నించటం.
నీ ఊహలో బ్రతికేయటం.
నీ నవ్వుకై తపించటం
నీకోసమే జీవించటం.
...
నా మనసే నీవశమై,
నన్నెపుడో వీడిపోయి...
నీతోటే ఉంటానని నను నీవైపుకు లాగుతుంది...
ఇక తప్పని ఈ తిప్పలతో తడబడుతూ చెబుతున్నా...
I Love You.....


Saturday, January 28, 2012

"Really I Hate U"


నీవులేని ఈ క్షణాలు ఇపుడు భారంగాలేవెందుకు?
నీవు విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు ఎచట సేదతీరుతున్నాయో!
నా ఆలోచనవై నడచిన నీవేనా అది?
నా మనసునెరిగినట్లు తలూపిన అమాయకత్వమేనా అది!
వద్దనుకుంటూ మళ్ళీ అదే పంజరాన చేరావు?
ఋజువులు కావాలంటే నావైపు కోపంగా చూడటం కాదు!
నీ మనసు చెప్పే సమాధాన్ని ఓపికగా వినుముందు.
నీ మీద కోపం లేదు!
అలా అని జాలీ లేదు!
ఎందుకంటే ఎప్పటికీ నువ్విక రెండింటికీ చెడ్డ రేవడివే!!!