Monday, August 22, 2011

"క్రొత్త తరాలను స్వాగతించేందుకు పచ్చదనాన్ని ఆహ్వానిద్దాం"





"నీవు నిలిచిన చోటుకైనా కొంత రక్షణనివ్వలేవా?
 నీవు పీల్చే గాలి సైతం ధరణి చేసిన దానమేగా!
 ఆకలంటే పండ్లనిచ్చెను!
 దాహమంటే నీటినిచ్చెను! 
 ప్రాణమంటే వాయువిచ్చెను!
 తనను తనివితీరా చూడమంటూ తిరగటానికి చోటునిచ్చెను!


 భగభగ మండే అగ్నిగోళమై,
 హృదయాంతరాలు సలసల కాగినా,
 ఉప్పెనలెన్నో ఉపద్రవాలై అణువణువునా..
 నిలువెల్లా గాయాలే చేసినా!
 పచ్చదనాన్ని తనపై కప్పి,
 తన బాధలనంతా గతమని మరచి,
 తరంతరంగా నిరంతరంగా...
 సాగే యీ తన పయణంలోన...
 ఈ పుడమితల్లి పాలు త్రాగుతూ,
 తన రొమ్ములనే తంతున్నాము!
 ఖనిజాలంటూ కుళ్ళబొడుస్తూ,
 తన రక్తాన్నంతా తోడుతున్నాము.
 ఇన్ని బాధలకంటూ ఓ కన్నీటిని కార్చితే,
 సునామి అంటూ పరిగెడుతాము,
 తన బాధనంతా దిగమ్రింగి ఓ చిన్న నిట్టూర్పునే వదిలితే,
 టోర్నడోలంటూ బయపడుతాము.
 చివరికి! కనికరించని భూమాతంటూ శాపనార్థాలు పెట్టేస్తాము!


 ఇప్పటికేమీ మించిపోలేదు!
 అలా అని ఊరుకునేందుకు సమయమూలేదు!
 కనిపించని ఆ దేవుని రూపం,
 ఈ భూమాతని ఎరుగు!
 నీ తప్పులకంటూ ఓ మొక్కని నాటితె,
 అది ఇచ్చే వాయువు నీ ప్రాణం విలువ!
 పురిటి నెప్పులు రోజూ పడుతూ,
 మన పాపాన్నంతా కడుపున దాస్తూ,
 ఇంకా ఎన్నాళ్ళని భరిస్తుందో!


 ప్రేమగా చూస్తే ప్రశాంతతనిస్తుంది,
 కాదని ఇదేతప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే,
 సమస్త ప్రాణకోటికే మరణఘంటికలు మ్రోగిస్తుంది ఖబడ్ధార్!!! "


Sunday, August 21, 2011

"మానవ ధర్మం!"


"కనురెప్పల మాటున కొలువైన కన్నీటిని,
 ఎన్నాళ్ళని ఆపి ఇలా ఆవేదన పడతావు?
 వెలుగులో చీకటిని చూస్తూ,
 చీకటి దారుల్లో పరుగులు తీస్తూ...
 చెలిమి చిరునామాలు చెరుపుకుంటూ,
 కాల గమనంలో నలిగిపోతూ...
 మనసుని కొలిమిగా మార్చుకొని,
 హృదయాన్ని రాతిలా మలచుకొని,
 గతానికి సమిథలా మారుతావా?
 భవిష్యత్ అంతా మైనమై కరిగిపోతావా?
 ఆశ-నిరాశల మధ్య పావులా మారినా!
 గతజన్మ పాపాలకంటూ ఇలా బందీ అయినా!
 విధి ఆడే వింత నాటకంలో...
 ఇవికూడా ఊహించని మలుపులే!
 కన్నీటి స్నేహాన్ని, కష్టాల చెలిమినీ మరచిపో...
 విచ్చుకొనే పూల పరవశాలను,
 ఎగిసిపడే అలల అల్లరి ఆటలను,
 మేఘాల మాటున ఆ చందమామ దోబూచులాటలను,
 మనసుతో చూడు...
 అడుగడుగునా ఆటంకాలే!
 అయినా పరిగెట్టాలనే ఆరాటాలే!
 ఇదే జీవితం! ఇదేమిటని ఆలోచించటం అవివేకం!
 కష్టసుఖాలతో మమేకమైపోవటమే మన ధర్మం.
 మానవ ధర్మం!"

ఇట్లు.....మీ నాన్న!



నా కవితాభిమాన స్నేహితుడు గవిరెడ్డి వెంకటరమణ కోరికపై వ్రాసిన కవిత ఇది...


"నీవు నీవేనా రా చిట్టికన్నా?
 లేక మా ఇద్దరి ప్రేమను కలుపుకొని,
 మైమరపించే నవ్వులతో మా ముందుకొచ్చిన వరాల మూటవా?
 నీ అల్లరిలో నా పసితనం ఉంది!
 నీ రూపంలో మీ అమ్మ సుకుమారముంది!
 నీ చిరాకులో మా నిర్లక్ష్యం కనిపిస్తుంది.
 ఆ బోసి నవ్వులలో మా ప్రేమ కనిపిస్తుంది.
 నీ సంజ్ఞల భాష మాకు అర్థంకాదు,
 కానీ దాని మరమార్థాన్ని మాత్రం అర్థమయ్యేలా ప్రవర్తిస్తావు.
 నీకు మాటలు రావని ఎవరన్నారు?
 వాటిని అర్థం చేసుకొనే పరిజ్ఞామే మాకు లేదురా!
 మేము కనబడకపోతే నీలో కనిపించే ఆరాటం!
 కనపడిన వెంటనే నీ మోమున మెరిసే వెన్నెల...
 ఎన్ని సార్లు చూసినా తనివి తీరదురా బుజ్జి తల్లీ...
 నీ రాకతో మా జీవితాలలో సంతోషాన్ని నింపావు.
 ఈ ఆనందం నిండు నూరేళ్ళూ ఇలానే వుండేలా చూడమని,
 ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ.......
         మా గారాల పట్టి "కుసుమాంజలి"కి ఇదే నా కవితాంజలి...

                      ఇట్లు,
                      మీ నాన్న.  "



"అనగనగనగా!"





"చేజారిన సంతోషపు ఆనవాళ్ళు వెదికేందుకు,
 వీలు ఇప్పుడు దొరికింది!
 బాధ్యతలు వదిలివేసి,
 వయసుని ఇక సగంచేసి,
 కరిగిన కాలంలో కలలా చేరే,
 వీలుందంటే మా జోరుకు మళ్ళీ ప్రాణం వస్తుంది!
 .
 .
 .
 అందాల వెంట పరుగులు,
 చుర చుర చూపుల పలకరింపులు,
 ఆటలు,స్నేహితులతో ఆటవిడుపులు,
 అమ్మాయిల పరిచయం కోసం పడే పాట్లు.
 పుస్తకాలకు సెలవిచ్చి,
 పుత్తడి బొమ్మల్ని చదువుతుంటే,
 ప్రతి పేజీ మిస్టరీనే!
    అంతులేని హిస్టరీనే!
 దిశా నిర్దేశం లేదు,
   లక్ష్యం అసలే లేదు.
 ఇప్పుడొక్కసారి ఆలోచిస్తే!
 ఆ చిలిపితనపు సవ్వడిని చేయాలన్నా చేయలేని ఒంటరితనం.
 ప్రతిరోజూ ఆవిరైపోయే అసహజత్వం.
 .
 . 
 .
 జీవితంలో అవి తిరిగి రాని రోజులు!
 అందుకే... ఎన్నటికీ మరపురాని మధుర స్మృతులు..."


Saturday, August 20, 2011

"నాలో నేను..."




"నాలో జరిగే అంతర్మధనం,
 ఎందుకు? అనే ప్రశ్నకే ప్రశ్న!
 సమాధానం దొరికేలోపు ఏమౌతుందోనని,
 కలతేచెందని మనసు తోడుగా...
 కన్నీటి గాయాల్ని మానుపుకుంటూ,
 చిరునవ్వుల పూదోటల్ని పెంచుకుంటూ,
 సంతోషం లక్ష్యంగా!
 ఆత్మ విశ్వాసమే ఆయుధంగా!
 నా అడుగులు ముందుకేస్తూ,
 ప్రతి మనసునీ పలకరిస్తూ,
 సాగే యీ ప్రయాణంలో,
 శత్రువులూ స్నేహితులే!
 వైరాగ్యం నను కమ్మి,
 ఆ దైవమే దిశానిర్ధేశం చేస్తే,
 నా మనసేనా ఆలి!
 యీ శరీరమే నా తండ్రి!
 నా ఊపిరే నా తల్లి!
 ఇంకేదీ ఒంటరితనం?
 ఇక ఏదీ నాలో నిర్వేదం?
 ఇక,
 అందరూ నా తోడే....
 నాకు దిక్కు ఆ దేవుడే!" 


నువ్వేం చేసావ్?



నువ్వేం చేసావ్? అని అడుగుతుంటారు!
????????????????????????

కాని నేను ఏం చేయలేదో చెప్తాను...
స్నేహం ముసుగులో నమ్మక ద్రోహం చేయలేదు!
ప్రేమ పేరు చెప్పి ఏ మనసునీ మోసం చేయలేదు!
మాటల్లో మాధుర్యం చూపి హృదయంలో వికారలన్ దాచలేదు!
సేవచేస్తానని అందలమెక్కి ఎవ్వరి నోట్లో మట్టికొట్టలేదు!
సహాయమంటూ దగ్గరికొచ్చిన వారికి మొండిచేయి చూపలేదు!
తల్లిదండ్రులను విస్మరించి నా ఉన్నతినే కోరుకోలేదు!
గాల్లో మేడలుకట్టి ఎన్నడూ మేఘాలపై విహరించలేదు!
డబ్బుకు ప్రాధాన్యమిచ్చి అనుబంధాలను నిర్లక్ష్యం చేయలేదు!
ఓటు ని నోటుకు అమ్మి ప్రజాస్వామ్యాన్ని వ్యభిచరించలేదు!
పరుల సొమ్ముకు ఆశపడి నా వ్యక్తిత్వాన్ని మంటగలపలేదు!


అన్నింటి కంటే ముఖ్యంగా.........
మనమంతా సమానం అనేవిషయాన్ని కలనైనా మరువలేదు! 



ఇది నా పాట కాదు! అన్నా హజారే మనసున దాగిన మాట..........



"ఊపిరే పోతుందన్నా నా కళ్ళల్లో బెదురేలేదు,
నా నీడ నన్నే విడినా నా పయనంలో మార్పేలేదు!
యీ దేశభద్రతకే మీ అధికారాన్ని ప్రశ్నిస్తున్నా.
వెనుతిరగని పోరాటానికి శంఖారావం పూరిస్తున్నాను.   ||ఊపిరే పోతుందన్నా||


కలలెపుడూ కల్లలు కావు,
ప్రజలే నా వెంటేవుంటే.
ప్రజాస్వామ్య మంటే నేను,
పాతర్ధాన్నే చెబుతున్నాను.
మా లక్ష్యం సేవే అంటె నమ్మేటందుకు ఎవరూ లేరు!
మీ పద్దతి మారకపోతే పోరాటం లో మార్పేలేదూ.........  ||ఊపిరే పోతుందన్నా||


సిగ్గంటూ లేనేలేని,
నీతిమాలిన నేతలు మీరు.
నా పద్దతి మారాలంటూ,
ఎన్నాళ్ళని ఇక శాసిస్తారు?
ఇన్నాళ్ళ నా జీవితమంతా సమాజ సేవకు కేటాయించా,
ఇక ముందు దేశం కోసం ప్రాణాన్నైనా అర్పిస్తా నేను!   ||ఊపిరే పోతుందన్నా||"




Friday, August 19, 2011

I am also an INDIAN



"వినపడలేదా! తన స్వరము,
 కనపడలేదా! యువసైన్యం! 
 ఇక ముందుకే యీ పయనం,
 ఆగదు యీ సమరం!   ||వినపడలేదా!||


 తెల్లదొరలు వెళ్ళారనుకుంటే,
 మీరువచ్చి ఇపుడేం చేసారు? 
 పేదవాళ్ళు ఆకలితో వుంటే,
 స్కాములంటు ఎంతనిదోస్తారు?
 సాగదు ఇక మీ ఆట!
 అన్నా!! అంటాం అంతా.      ||వినపడలేదా!||


 మీకు మాత్రమే చట్టం చుట్టం,
 ఇక ఎక్కడున్నదీ సమానత్వము?
 రాజ్యాంగం ఉన్నతమంటూనే,
 ఆ పరిధిని దాటిన సాములు మీరు!
 అడగటమేనా తప్పు?
 లేదా మాకు హక్కు!           ||వినపడలేదా!||


 మా బ్రతుకులలో వెలుగు నింపమని,
 అధికారాలను మీకందిస్తే!
 ప్రజాస్వామ్యాన్ని పక్కనెట్టి,
 ప్రతిపనిలో డబ్బూని దోస్తారు. 
 మారకపోతే కష్టం!
 ఇక దొంగల రాజ్యం అంతం!


 వినపడలేదా! తన స్వరము,
 కనపడలేదా! యువసైన్యం! 
 ఇక ముందుకే యీ పయనం,
 ఆగదు యీ సమరం! 



అన్నా హజారే దీక్షకు నా పాటతో చెపుతున్నా  సంఘీభావం!!!!!!



వింటున్నావా...........





"ప్రేమ????
 ఇది రోజూ చూసే పరిసరాలని క్రొత్తగా చూపుతుంది!
 ఒడిదుడుకుల జీవితంలో ఆనంద హరివిల్లుల్ని విరజిమ్ముతుంది!
 వర్ణించటానికి వీలులేని,
 చెప్పనలవి కాని,
 అక్షరబద్ధం చేయలేని,
 ఎన్నో అనుభూతులని మిగుల్చుతుంది!!!!!"






వింటున్నావా...........



 "ప్రేమ???? 
 అలుపెరుగని ఆనందాలను అందించేందుకు...
 ఆహ్వానించే అందాలసీమ!
 ప్రేమలో బాధలు వుండవు అని కాదు!
 ఆ బాధల్ని కూడా ప్రేమించిన వారితో పంచుకుంటే...
 సంతోషంగా వుంటుందనే Sweet    Feeling!!!!!!!!!!!!!"





Thursday, August 18, 2011

వింటున్నావా.... నా మాట!


"ఎన్నో ప్రత్యేకతలు నీ అడుగుల సవ్వడిలో,
 మరెన్నో సందేహాలు నీ మౌనపు చూపులలో!
 చురచుర చూపుల మాటున,
 తెలియని కోపాలెన్నో!
 తీయని నవ్వుల మాటున,
 నా మనసెరిగిన మధురిమలెన్నో!
 నే చూసిన కోణంలో నీ అందం అపురూపం!
 నిదురించే వేళలలో మురిపించే అమాయకత్వం!
 కవిలా నిను చేరుకొని,
 కవితల్లే నిను శోధించనా!
 శ్వాసై నీలో చేరి,
 హృదయంలో కొలువుండనా!
 ఆకలిదప్పులనెరుగని మంత్రము నాపై వేస్తే,
 నిద్రలేని రాత్రులెన్నో నిటూరుస్తూ గడిపాను!
 అలక మానేవేళ అచ్చెరువొందే రూపం!
 చెంత చేరేవేళ పరిమళాల పన్నీటి వర్షం!
 జీవితమంతా నీవై నావెంటే నువ్వుంటే,
 నీది కాని మరోలోకం నాకెక్కడ వుంటుంది!"



Wednesday, August 17, 2011

పెద్దలకు మాత్రమే (A) .....





"కన్నుల తమకం,
 పరువపు గమకం,
 సరసాల సరాగాల సరిక్రొత్త ఊహలకు అర్ధం!
 బాధలను తరిమే ఆయుధముండి,
 ప్రేమను పంచే ప్రేయసి మనకై,
 జీవితమంతా తోడై వుంటే!
 స్వర్గపుదారులు తెరిచేటందుకు,
 మనకో ఆశను కల్పిస్తుంది. 


 తనువులు ఆడే దాగుడుమూతలు!
 రేయిని మరచి,
 నేలను వీడి,
 వెన్నెల పరుపుపై అలజడి రేపి,
 కోరిక దప్పిక తీరేవరకు,
 ఆటను ఆపక కొనసాగిస్తూ,
 సరిక్రొత్త మలుపేదైనా వుందా! అనే,
 శోధనలోన శృంగార పయనం...
 ఎంతసేపైనా తీరని దాహం,
 అది ఒక తీయని అనుభవం! "





"నిజం చెప్పనా........"




"జీవితాంతం నీ తోడుంటానని నేను ఇన్ని అడుగులుముందుకేసా...
 ఒకేఒక్క తప్పటడుగుతో నాప్రాణాన్ని బలిచేసావ్!
 నీ కన్నీటి బొట్టులో నిజాయితీ లేదు,
 కానీ నా ప్రేమలో నిజయితీని వెదుకుతూ ఎన్నో పరీక్షలు పెట్టావ్!
 నీ మనసులో నాకు చోటులేదు,
 నా ప్రయత్నానికి విలువలేదు,
 ...
 ...
 ...
 చూస్తున్నా నీ మనసుని యీరోజు నేను నిజంగా!!!!..." 



"చెప్పనా?..."



"చెప్పనా? నేను మనిషినని!
 చెప్పనా? నాకూ అత్మీయతలున్నాయని!
 చెప్పనా? నాదీ నీలాంటి ప్రాణమేనని!
 చెప్పనా? నీలాంటి నీతిమాలిన మనుషులవల్ల రోజూ చావలేక బ్రతుకుతున్నానని!
 చెప్పనా? రోజు రోజుకూ మా ప్రాణ రక్షణ కరువవుతుందని!
 చెప్పనా? మన వెనుక తరాలు కలలుకన్న భారతదేశ ప్రగతి ఇదికాదని!
 చెప్పనా? నా యీ ఆవేదనలో నిజం వుందని!
 చెప్పనా? నీ రాతిగుండె ఎప్పటికీ కరగదని!
 చెప్పనా? నువ్వు ఈ లోకం లోకి వచ్చిన లక్ష్యం ఇదికాదని!
 చెప్పనా? నీ మనసంతా అజ్ఞానంతో కప్పివేయబడ్డదని!
 చెప్పనా? నువ్వింకా మనిషిగా రూపంతరం చెందలేదని!
 చెప్పనా? మరుజన్మకు నీకు మనిషిగా అవకశంలేదని!
 చెప్పనా? నేను మరణించిన క్షణం నుండి నువ్వు చస్తూబ్రతుకుతావని!
 చెప్పనా? నువ్వు చేసిన పాపాలకు నీ పిల్లలు బలైపోతారని!
 చెప్పనా? వాళ్ళు కూడా రేపు నీలానే హంతకులుగా మారుతారని!
 చెప్పనా? వాళ్ళకి సమాజం నుండి ప్రేమ లభించదని!
 చెప్పనా? నిన్ను కట్టుకున్న నేరానికి నీ భార్య బలైపోతుందని!
 చెప్పనా? ఇకనైనా నువు మారకుంటే నీ అంతరత్మకూడా నిన్ను క్షమించదని!
 చెప్పనా? నీ మార్పుకి ఇంకా సమయముందని!
 చెప్పనా? నువ్వు కలలో కూడా ఊహించని ఓ సరిక్రొత్త రంగుల ప్రపంచం నీకోసమే వేచివుందని!
 .........................................................
 .........................................................
 ఇంతచెప్పినా అర్ధంకాకపోతే నీకిక ఎంతచెప్పినా వ్యర్ధమే!!!!!!!!!!!!!!!!"



Sunday, August 14, 2011

Happy Independence day..............


"A Page from our Leader's Diary"


"మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.
సేవంటూ మీపైస్వారీ చేస్తూ,
చేవలేని మీ బ్రతుకు సాక్షిగా,
రంగుమార్చిన తెల్ల దొరలము...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.


స్వాతంత్ర్యాన్నే సాకుగ చూపి,
తరతరాలుగా ఏలుతువున్నాం!
డబ్బులు దోస్తాం ప్రాణం తీస్తాం,
అడిగినవారిపై నిందలు వేస్తాం...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.


మాపిల్లలకు రక్షణనిస్తాం,
వారేమడిగిన ముందుంచేస్తాం.
మీ డబ్బుతొ మేం కులాసగ బ్రతుకుతు,
మీకళ్ళల్లో కారంకొడుతాం..
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.


ఓటు ఓటుకూ వందలనిస్తాం,
ఙ్ఞానంపోయే మందుని పోస్తాం,
మీప్రాణాలను గాలికి వదలి,
మా కుక్కల కోసం లక్షలు పోస్తాం...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.


ధరల బాధలు తట్టుకోలేక, 
జీతాలను పెంచాలని అంటే,
పెంచుతూనె కోతలను పెడుతాం!
పనులు మాత్రమేం చేయకుండనే,
మా భత్యాలను అనుభవిస్తాము...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి. "



"Waiting for real Independence.............."


"ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?
ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?
పేదబ్రతుకులకు విలువేలేదు!
ఇక నీతి నేతలే కానరారు!
ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?

ఆడతనమేమో అలుసవుతుంది!
అమ్మతనం రోడ్డున పడుతుంది!
వయసు మీరిన అమ్మనాన్నలకు,
ఆశ్రయమే కరువౌతువుండగా...
ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?


పసిపిల్లలతో రక్తపు ఆటలు!
బడిమొహమెరుగని పేదపాపలు!
కష్టాలను గుండెల్లో దాచుకు,
బ్రతుకులీడ్చు ఈ బడుగు బ్రతుకులకు...
ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?


యువతరానికేం పట్టకున్నది!
తప్పతాగి తెగతూలుతున్నది!
దేశంకోసం ఆలోచించని,
పండుముదుసలీ నవతరానికి...
ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?

మంచితనానికి మనుగడలేదు!
దౌర్జన్యాలకు అంతంలేదు!
గూండాయిజమే ప్రజలనుయేలే,
ప్రజాస్వామ్యమే మనముందుంటే...
ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?


చెడ్డవారికే నేతల అండ!
మన బ్రతుకులకిక మనుగడవుందా!
రక్షకభటులే కాలయముడులై,
జీవితాల్ని చిదిమేస్తూ వుంటే...
ఏదీ స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం?


మతం మంచిని వదిలేస్తుంది!
కులం కంచెలా మారుతువుంది!
పనికిరాని ఈ అడ్డుగోడలను,
కూల్చేధైర్యం చేయలేని....
మనకేదీ  స్వాతంత్ర్యం?
ఎవరికి ఈ త్యాగఫలం? "


Saturday, August 13, 2011

"అదృశ్య శిల్పి "





"ప్రతి తలపుదీ చిలిపి తనమే... 
మనసు నేర్పిన కొంటె తనమే!
కౌగిలి బిగువులు,

చూపుల చురకలు,
మాటల విరుపులు,
మనసుల తగవులు...
మలిచెనిలా నెరజాణలా...

వచ్చేవరకూ ఎదురు చూపులు,
దరిచేరాక ఆదే తుంటరి ఆటలు,
మార్చాయిలా నను సజీవ శిల్పంలా!

పసిపాపను చేసేనీ లాలన,
నను కంటికి రెప్పలా కాపాడాలనే నీ తపన,
నను నీ దాన్ని చేసాయి,
నన్ను నీలో  ఐక్యం చేసాయి!" 



"Happy Raksha Bandhan"



"రాఖీ కట్టిన ఈ చేతితోనే,
 చిట్టి తల్లికి గోరుముద్దలు తినిపించాను.
 డబ్బుకన్నా విలువైన ఆత్మీయతను,
 నీకు లాలనగా ఇచ్చాను.
 అందుకనే చెబుతున్నా.....
 నేను నీ అన్నను అందుకే నువ్వేది అడిగినా కాదు! అనను! 
  
 అమ్మలోని ప్రేమను చూసావు!
 నాన్నలోని నమ్మకాన్నీ చూసవు!
 ఆరెండూ కలిసిన అన్నలోని అనురాగాన్నీ పొందావు.
 అందుకనే చెబుతున్నా.....
 నేను నీ అన్నను అందుకే నువ్వేది అడిగినా కాదు! అనను!  


 నీకు ఎన్ని ఏళ్ళు రానీ,
 నువు నా బుజ్జి తల్లివే..
 ఎంత ఎదిగినకాని,
 ముద్దుమాటలతోటి నను 
 బురిడీ కొట్టించిన నా చిన్నారి చెల్లివే.
 అందుకనే చెబుతున్నా.....
 నేను నీ అన్నను అందుకే నువ్వేది అడిగినా కాదు! అనను!"  




Thursday, August 11, 2011

"ఇదీ భారతదేశం!"


"ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
అంతులేని సంపదలకు నెలవు.
విభిన్న కళలకు తెలిసిన కొలువు.
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.


చుట్టూ కష్టాలెన్నో వున్నా!
చెరగని చిరునవ్వులు మా సొంతం.
పేదరికంలో వున్నాకానీ!
భారతీయుడనని తెలియని గర్వం.
శత్రువులే కష్టంలో వున్నా! 
చలించిపోయే కరుణ హృదయులం.  
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.


మనుషులలోనే దేవుని చూసే,
పసిహృదయం మా మనసుల సొంతం!
కష్టకాలమే ఎదురవగానే,
ఫిరంగులై ఎదురెల్లి నిలుస్తాం!
ఆ.. స్థితిలోకూడా ప్రేమను పంచితే,
విషాన్ని తింటూ,
పాలను ఇచ్చే గంగిగోవులీ భారతీయులు!


ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
మసీదు పక్కన నివసిస్తాను,
రహీము తో స్నేహం చేస్తాను!
చర్చి గంటలకు కన్నులుతెరచి,
నే కొలిచిన స్వామిని పూజిస్తాను!
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.  "



"సలాం... సలాం!"



"ఆగని పోరాటానికి దక్కిన విజయం ఈ స్వాతంత్ర్యం.
 భారతదేశపు అణచివేతలో పెల్లుబికినదే యీ స్వాతంత్ర్యం.
 దేశ ప్రజల చిరునవ్వుల కోసం,
 గాంధి చూపిన తెగువకు చెబుదాం......
 సలాం సలాం.... .... మీకు సలాం సలాం!
  
 మంచితనంపై అధికారంతో,
 జనులను బానిసలుగ చేసి.
 మా సంపదనే మీ సొత్తంటూ దేశాన్నే లూటీ చేసి,
 సాగించిన అరాచకాలపై,
 పొందిన విజయం యా స్వాతంత్ర్యం.
 రక్తపుటేరులపై నడుస్తూ,
 సాధించినదే యీ... స్వాతంత్ర్యం.
 ..............................
 యీ పోరాటంలో అసువులుబాసిన ,
 ప్రతిఒక్కరికీ చెబుదాం మనసున,
 సలాం సలాం.......మీకు సలాం సలాం!


 స్వాతంత్ర్యం నా జన్మహక్కనే లక్ష్యాలెన్నో చూసాము,
 చావుకు కూడా రొమ్ములు విరిచిన ధీరశాలులను చూసాము,
 ఇందరి ప్రాణాలర్పణ చేసి,
 ఇచ్చినదేగా యీ స్వాతంత్ర్యం.
 దేశంకోసం బెదరని పోరును,
 సలపిన వీరులదీ.. స్వాతంత్ర్యం.
 ...................................
 ఆ గుండెలనిండా దేశం స్వేచ్చను,
 నింపుకున్న ప్రతిగుండెకు చెబుదాం.
 సలాం సలాం..... మీకు సలాం సలాం!"



Wednesday, August 10, 2011

"ఓ ఆత్మ.."



అతి తక్కువ సమయం లో నాకు ఆత్మీయునిగా మారి, మనందరి మధ్య నుండి తిరిగిరాని తీరాలకు వెడలిపోయిన నా మిత్రుడు సాయి మరణానికి ఇదే నా అశ్రునివాళి.............


"ఓ ఆత్మ నేడు,
 తనకు ఇన్ని రోజులూ ఆశ్రయమిచ్చిన శరీరాన్ని వదలి,
 ఈ విశ్వ రహస్యంలో అంతర్ధానమైపోయింది!
 సృష్టి మూలాలను చేధించేందుకు,
 తన ఆశను,తన నీడను ,
 తన అర్ధాంగిని,తన రక్తాన్ని,
 అనుంగులను,అన్నదమ్ములను,
 అందరి చిరునవ్వులను చెమర్చుకుంటూ...
 తనగుండె చప్పుళ్ళను ఆపి,శరీరన్ని వదలి,
 సత్యాన్వేషి అయి ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
 తెలవారాక ఆ పలకరింపులు లేవు! 
 మలుపు మాటున సడిచేసిన ఎరిగిన గొంతుక లేదు!
 చిరునవ్వులు చిద్రమవుతూ,కనుల ముందే బూడిదవుతూ,
 కన్నీటి వీడ్కోలులు అందుకొని,
 తిరిగి రాని లోకాలకు ఇంత త్వరగా వెళుతున్నావా?
 ఇన్నాళ్ళ నీ బాధను చెప్పుకునేందుకు,
 నీ తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నావా? 
 సమాధానం చెప్పు మిత్రమా!!!!!!!!!!!!!!
 ఆలశ్యమవ్వవచ్చుగాక @@@@@@
 ఖచ్చితంగా నేనూ నినుచేరి... నీ చిరునవ్వులు చూస్తాను.
 ఆ క్షణాన తిరిగి మనం మనసు విప్పి మాట్లాడుకుంద్దాం!!!"  

Monday, August 8, 2011

"కొంచెం ఇష్టంగా..."



"
 అతడు : చందమామనే అందుకున్న నా మనసు నా మాట విననంది."
 ఆమె  : వేయి జన్మల వరము నీవనే నిజము నాకిలా తెలిపింది!
 అతడు : నీ స్పర్శే  నను ముందుకు నడిపే సంజీవిని అని తెలిపింది.
 ఆమె  : చెప్పకనే నను అల్లుకుపోయే చూపుల అర్ధం తెలిసింది!
 అతడు : ఓ..హో నీ ప్రేమలో.. ఓ పువ్వునై
         వికసించనీ యీ జన్మకి.              ||చందమామనే||


 అతడు : చెప్పలేను నా ఊహల్లో నీ.. కౌగిలింత మోహం!
         పొమ్మనంటు నన్ను చంపుతుంది కమ్ముకున్న తాపం.
 ఆమె : చూపుతోనే నన్ను ఖైధు చేసే నీ.. ప్రయత్నం!
       తేనెటీగలాగ దోచుకుంధి నా సమస్థం.
 ఇద్దరు: గడిపేద్దాం ప్రతిక్షణాన్ని,
        మన ప్రేమను కలిపి ఓ రంగులలోకంలో...   ||చందమామనే||


 అతడు : పాలనురగలు నీ పెదవులపై నాట్యమాడుతుంటే...
        పంచదార నా పంటితోటి అందించనా?
 ఆమె : చాలు చాలు నీ ఆగడాలు ఆపు!ఇకచాలు,
        వద్దు వద్దనంటు వేడుకుంది సిగ్గుపడ్డ తనువు.
 ఇద్దరు : విహరిద్దాం ఆకాశాన,
        రెక్కల్నే చేర్చుకొని వెన్నెల వెలుగుల్లో.......


 అతడు : చందమామనే అందుకున్న నా మనసు నా మాట విననంది."
 ఆమె  : వేయి జన్మల వరము నీవనే నిజము నాకిలా తెలిపింది!
 అతడు : నీ స్పర్శే  నను ముందుకు నడిపే సంజీవిని అని తెలిపింది.
 ఆమె  : చెప్పకనే నను అల్లుకుపోయే చూపుల అర్ధం తెలిసింది!
 అతడు : ఓ..హో నీ ప్రేమలో.. ఓ పువ్వునై
         వికసించనీ యీ జన్మకి............."      


Sunday, August 7, 2011

"These Words are From My Heart"




"గతాన్ని తలుచుకు కుమిలే నాకు,
 రేపటి ఆశను చూపెను స్నేహం.
 అడుగడుగున నా తోడుంటుంది,
 ప్రతి ఆలోచనకూ ఊతమౌతుంది.
 ఇంకా చెప్పాలంటే.....
 చిరుదివ్వై నే ముందుకు సాగితే,
 మైనం లా వెంటేవుంటావు.
 చీకటులే నను తరుముతువుంటే,
 కిరణంలా నాకెదురౌతావు.
 అందుకే,
 నా ఈ జీవితానికి యీ శోభనిచ్చింది నీ స్నేహం....
 ఇక యెన్నేళ్ళయినా వన్నె తగ్గనిది మన స్నేహం......"


 నేటి యీ స్నేహితుల దినోత్సవం కి నా మనసున దాగిన...
 మాటలతో చెబుతున్నా  శుభాకంక్షలు...." 



"Happy Friendship Day to My Friend......"




"నువు నా ప్రాణం నేస్తం,
 ఒకరికి ఒకరం సొంతం!
 ఎవరేమన్నా కానీ,
 ఒకటే ప్రాణం మనది.


 నువు నా ప్రాణం నేస్తం,
 ఒకరికి ఒకరం సొంతం!


 నా జీవితానికి అర్థంలేదు,
 నా పక్కనే నువ్వు లేకుంటే.
 ఇంద్రధనుస్సు నాకు అక్కరలేదు,   
 నువ్వు నావెంట రాకుంటే. 
 చెప్పగలను నేకన్న ఊహను, 
 చీకటిలోను వెలుగు రేఖను.           ||చెప్పగలను||


 నువు నా ప్రాణం నేస్తం,
 ఒకరికి ఒకరం సొంతం!
 ఎవరేమన్నా కానీ,
 ఒకటే ప్రాణం మనది.


 చందమామలా కనిపించావు,
 నిండు వెన్నెలను మనసున దాచి.
 కంటిరెప్పవా తోడుంటావు,
 చంటిపాపలా కాపాడేందుకు.   
 నా కంటిచూపుకే నే చెపుతాను,
 నువ్వు వుండగా నే మోసపోనని.      ||నా కంటిచూపు||

 నువు నా ప్రాణం నేస్తం,
 ఒకరికి ఒకరం సొంతం!
 ఎవరేమన్నా కానీ,
 ఒకటే ప్రాణం మనది."