Tuesday, January 29, 2013

Save as


ఇంకెన్నాళ్ళు???
అంతః ప్రవాహ అంతిమ చిత్రం!
ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు,
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

సమాజానికో అద్దం ఇచ్చి,
క్షణక్షణానికి రంగులు మార్చి,
ముందున్నప్పుడు వెనుకకు చూపి,
వెనకున్నప్పుడు ముందుకు చూపి,
ముందు వెనుకలకు మధ్యన పెట్టి,
తడికలు చుట్టి గంతలు కట్టి,
నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

నీది కాని నీ తనువుని చూస్తూ,
తడబడి పోతూ,
తమకపు కన్నులు చప్పుడు చేస్తూ..
తప్పులుచేస్తూ తిప్పలుపడుతూ..
క్రొద్దిసేపేమో కన్నీరంటావ్,
క్రొద్దిసేపేమో పన్నీరంటావ్,
కన్నీటిలోన పన్నీరు కలిపి
తప్పక ముందుకు సాగిపోతున్న,
తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది!
బ్రతుకు బండిపై ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని,
బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ...
నన్నే చూస్తూ నిన్నే తిడుతూ,
నీకూ-నాకూ గొడవలు పెడుతూ,
కడుపులు కొడుతూ,
కలుపుని తింటూ...
తప్పులు చేస్తూ ముందుకు సాగే,
వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!
నీది కాని నీ తనువుని మోస్తూ,
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!