Tuesday, July 30, 2013

సత్యాన్వేషి




నేను నిన్ను నిద్రలేపలేకపోవచ్చు కానీ
నువ్వు మేల్కొనొచ్చేవరకూ నీ ఇంటి బయటే ఉంటా!!!
నిద్రలేచి నువ్వొచ్చాక
నువ్వు ఓడిపోయావనో లేదా నేను గెల్చాననో చెప్పేందుకో!!
లేదా నువ్వు ఇకనైనా మారాల్సిందే అని చెప్పటానికో కాదు -
నేనింకా మారలేదని నీకు తెల్పేందుకే...

మరి క్రొద్ది సేపట్లో నేను తిరిగెళ్ళిపోతాను
నేను కనుమరుగయ్యేంతలోనే
నీకు సమాధానం దొరకొచ్చు
దొరికింది కదా అని నన్ను పిలవకు
ఇప్పుడు నువ్వేంటో నీకు తెల్సు
నువ్వేంచేయాలో కూడా నీకు తెల్సు
అప్పుడిక ఆలస్యం చేయకు-
రేపటిని ప్రశ్నించేందుకు సూర్యుడ్ని తోడ్కొని బయల్దేరు .... 


Wednesday, June 5, 2013

హతోస్మి



1
నేనివేళ నవ్వగల్గుతున్నాను

చిన్నప్పటి మా ఇంటి

చిన్నగది చిన్నబోయేలా నవ్వగల్గుతున్నాను!!!



చెప్పులకు డబ్బులడిగితే

నాన్నెక్కడ తిడుతాడోనని

చిల్లుబడ్డ చెప్పులోంచి బాల్యాన్ని కాల్చుకున్న

రోజులు సిగ్గుపడేలా నవ్వుతున్నాను!!!!



ఇరుకు సందుల్లో నలిగిన

నా పసితనం గుర్తుకు తెచ్చుకు మరీ నవ్వగల్గుతున్నాను...



నవ్వుతున్నాను

నవ్వుతున్నాను

నవ్వుతూనే ఉన్నాను....

ఎంతవరకు నవ్వానంటే..

రాజసౌధం లాంటి కొత్తింటి కిటికీ తీసి

ఎదురుగా కనబడ్డ చెట్టు క్రింద

నిన్నటికీ - రేపటి మధ్య ఇరుక్కు పోయిన

చిల్లుల బట్టల్లోని అరవైఐదేళ్ళ అసహాయత

నిస్సహాయపు చూపులు నాలో ఇంకేదో వెతుకుతున్నాయని

నాకర్దమయ్యేంత వరకూ నవ్వాను....

అతిధులందరూ వచ్చారు ఇక మీరూ రండని

నా శ్రీమతి అనుండకపోతో ఆ వృద్దుని

చూపుల అగాదాల్లో అంతర్దానమైపోదునేమో!!!!



2
పదిహేనేళ్ళు గడిచిపోయాయి...

ఇప్పుడు సినీవినీలాకాశంలో నేనో పెద్ద స్టార్ ని...

ఈ పదిహేనేళ్ళలో రోజెప్పుడు మొదలైందో

నేనెక్కడ ఆగానో తెలియని పరుగు...

ఇంతపరుగులోనూ

నన్ను కట్టిపడేసే ఆ చూపులు

ఇల్లు దాటి వెళ్ళేప్పుడు

కారు అద్దాలు దాటి మరీ నన్ను శోధించాయి!!!

తన మెలుకువ చూపులకు

చిక్కకుండా పోవడమన్నది ఏ ఒక్కసారీ జరగలేదు!!!



నా ఈ సినీ ప్రయాణంలో

నా పేరున సేవా సంఘాలు

సామాజిక కార్యక్రమాలు

నాలో మానవీవకోణాన్ని ఆవిష్కరిస్తే..

సినీ జీవితం పేరు ప్రఖ్యాతులను

రాజకీయరంగం మంత్రి పదవిని కట్టబెట్టింది



3
ఈ రోజే ప్రమాణ స్వీకారం...

నన్నిన్ని రోజులు సోదించిన చూపులకు

సమాధానం దొరికిందో లేదో నని తెలుసుకోవాలనిపించి

నన్ను అభినందించేందుకొచ్చిన అశేష జనవాహిని మధ్య నుండి

మాసిన బట్టలలో రోజులు లెక్కించే వృద్దాప్యానికీ నాకు

మధ్య దూరం ఇంతదగ్గరగా ఉందని తెలుసుకునేందుకు నాకు

పదిహేనేళ్ళు పట్టిందని తెలుసుకొని సిగ్గుపడ్డా!!!



నేనీ ఇంటికొచ్చి పదిహేనేళ్ళయింది...

నే కనిపిచ్చినప్పుడల్లా నాలో నువ్వేదో వెదికేవాడివి...

ఏమిటది???

తన పెదాలు కదులుతున్నాయి...

శక్తినంతా కూడదీసుకొని

ఒక్కో మాట కి తనకు మిగిలిన ఆయుష్షు పోస్తూ

ఇ న్నా ళ్ళు గా.... నే  నీలో ...వె తి కిం ది...

మ............ని.........షి..........ని....... 
.
.
.
.
తన ఈ  సమాధానం విని చూసేందుకొచ్చిన

నా తొలి కన్నీటి బొట్టుతన దేహాన్ని  ముద్దాడేంతలోనే

ఆ చివరి మాట పూర్తైన

క్షణం తరువాతి తను - క్షణం ముందటి నేను

ఒక్కసారిగా చచ్చిపోయాం!!!!!!!!
 

.

Wednesday, May 15, 2013

ఎందుకు రాములా???

1
ఎప్పట్లానే....
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కాడు రాములు!!!
మొదలెట్టిన చోటికే
తిరిగొస్తానని తెలిసీ 
నిన్నటికి దూరంగా
వెళ్ళాలనే ప్రయత్నంలో
ఐస్బండిని నెట్టుకెళ్తూ

2
రోజూ చేసే పనే అయినా
విసుగు రాదెందుకో...
విసుగురాదని మనమనుకోవటమేనేమో!
వచ్చినా దాన్ని రాములు
ఏరాత్రికారాత్రి
తన ఆత్మస్థైర్యపు వెలుగుకి
ఆవలున్న చీకట్లోకి విసిరేసి
తెలవారగానే
మళ్ళీ ఎప్పట్లానే
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కేస్తాడు రాములు!!!

3
ఏంది రాములా!!!
ఇంకెన్నేళ్ళు నెట్టుకొస్తావు
ఈ ఐస్బండిని
అన్న వారందరికీ
"నేను నెట్టుకొచ్చేది
ఇస్బండిని కాదు! నా కుటుంబాన్ని"
అన్న సమాధానం చెప్పికానీ,
ఆ కుటుంబాన్ని! కాదు కాదు
ఆ ఇస్బండిని నెట్టుకు పోడు...

4
కొందరి కళ్ళకి ఆ రోడెందుకో
నీరసంగా ఉంది కొన్ని రోజులుగా
రాములు పాదాల ముద్దుల్లేక!!!
అంతగా దగ్గరయ్యాడు చాలామందికి రాములు...

5
ఏమైఉంటుందోనని చూసేందుకు
రాములు ఇంటికి వెళ్లిన వారందనినీ
ఓ దృశ్యం మాత్రం కలచివేసిందాయింటి ముందు...!
అక్కడిప్పుడు
ఐస్‌ఫ్రూట్ తినటం పూర్తయ్యాక
విసిరి పరేసిన పుల్లలా
రాములు లేని ఐస్బండి!!!!!

Monday, May 13, 2013

అమ్మలేనితనం

ఆమె జీవితం ఓ సముద్రం,
ఎన్నో ఆటుపోట్లను తన
కన్నీటి తీరం దాటి రానిచ్చేది కాదు!
కానీ,
అవి దాటివచ్చిన ప్రతిసారీ
ఆమె చీరకొంగు తనలో
ప్రేమగా నింపుకునేది...

ఇప్పుడు అమ్మలేదు!!!
తనుగుర్తొచ్చి
నేను ప్రేమగా కొనిచ్చిన
చీరను హత్తుకొని
బాధ పడే ప్రతిసారీ
నా చేతిని అమ్మ చీరకొంగు
తడుపుతూనే ఉంది!!!


* అమ్మను కోల్పోయి ఆమె జ్ఞాపకాలతో బాధ పడేవారందరికీ..
...ఆమె ప్రేమ ఏదో ఒక రూపంలో మిమ్మలి స్పృశిస్తుంది...
...ఎప్పటికీ అలానే స్పృశిస్తూనే ఉండాలని ఆశిస్తూ....
...మాతృదినోత్సవ శుభాకాంక్షలు...

Thursday, May 9, 2013

అ - "అమ్మ"

అవును తను బిక్షగాడే!!!
తల్లి గర్భంలో మనలా స్వచ్చంగా పెరిగిందితడే...

కన్నీటిని వార్చి....
సంతోషాల్ని వడ్డిస్తుంది అమ్మ!!!

అమ్మ జీవితమోరోజే!!!
సగం వంటిల్లు! - సగం కన్నీళ్ళు!

అమ్మని చూసానీరోజు...
Web Cam ముందు వెక్కి వెక్కి ఏడుస్తుంటే!!!

చావు ముంగిట విలపిస్తున్నా!!!
ఒక్క సారొచ్చి చూసిపో బిడ్డా.....

సమాధిపై చెట్టు మొలిచింది!!!!
అమ్మకి నేనెండలో ఉండడం ఇష్టంలేదు.... 
 
 

Tuesday, May 7, 2013

నువ్వింకా మారలేదు!!!


నేను ఎవరిని?
కులం గంజాయి మొక్కని చెప్తూ..
తులసి కోటలో పెట్టి పూజించే అబద్దానివి!!!!!

ఆమెవరు?
కుల మతాల గుప్పెట్లో..
ఇంకా బందీగా ఉన్న స్వేచ్చాపావురం!!!

వీరంతా ఎవరు?
ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి...
ఓదాన్లో కులం! ఓ దాన్లో మతం నింపిన
కావడినందించేందుకొచ్చిన తెలివైన వారు!!!

అతని నవ్వెందుకు అంత స్వచ్చంగా ఉంది?
చనిపోయాడు కదా! ఇక ఎవరి కోసం నటించాలి!

చివరిగా...
ఇంతకీ నీవసెంత?
మీరంతా నన్ను పిచ్చోడ్ని చేసి..
ఇప్పటి కి సరిగ్గా మూడేళ్ళు!!!!!!
 
 

Tuesday, April 23, 2013


Monday, February 18, 2013

Black & White


సీన్ : 1
---------
కొన్నేళ్ళ క్రితం సరిగ్గా ఇక్కడే....
మానవత్వానికి మనిషికి
దూరమెంతుందో చూపే మైలురాయిలా!
ఊరిబయట ఎప్పుడొచ్చిక్కడ
చేరాడో తెలియదుకానీ,
కాలంతో పాటే
కదులుతున్నట్లే అనిపించినా...
గోడగడియారంలో కడ్డీలా ఉన్నచోటే మిగిలిపోయాడు .

సీన్ : 2
----------
కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో
ఎన్నో సంఘర్షణల మధ్య ఎదురొడ్డి నిలబడ్డ
ఓ రాయి .... రాయే!
ఎవరు విసిరేసారో
ఎపుడు విసిరేసారో తెలియదు కానీ
దానికిన్నాళ్ళకో మంచి తోడుదొరికింది.

సీన్ : 3
--------
మనుషుల మధ్యే
ఓ ప్రశ్నగా మిగిలిన మనిషతడు!
ఈ విశాల ప్రపంచంలో
తనకంటూ మిగిలిందీ రాయొక్కటే!
ఎందుకు నవ్వుతాడో తెలియదు,
ఏం గుర్తొచ్చేడుస్తాడో తెలియదు,
కానీ ఎప్పుడూ ఏదోకటి చెప్తుంటాడు...
ఆ మాటలకడ్డుపడని రాయి,
ఆలకించిందో లేదో తెలియదు కాని,
చినుకు మీదపడ్డప్పుడల్లా,
ఆ మనిషి కష్టాలు గుర్తొచ్చి
ఏడ్చినట్టే కన్పించేదీ ప్రకృతికి!

సీన్ : 4
--------
ఇప్పుడక్కడంతా కోలాహలం!
ఎవడో ఓ అబద్దాన్ని
కల పేరు చెప్పి తీసుకొచ్చాడు!
అది రాయికాదట!
మనరాతల్ని మార్చే దేవుడట!
అట,అట అట.....అంతేనట!
ఎన్నాళ్ళుగానో ఇక్కడే ఉన్న
ఇతని ఆకల్ని గుర్తించని వీరికి!
రాయిలో దేవుడున్నాడంటే..
గుడికట్టించేందుకు
ముందుకొచ్చిన దాతలెందరో...


సీన్ : 5
--------
ఇప్పుడా రాయి....
ఎండకెండట్లేదు!
వానకి తడవట్లేదు
మాటల్రాని ఆ రాయికి.
నేను కేవలం రాయినే
అని చెప్పుకోలేని నిస్సహాయత!
నాకెందుకీ ప్రసాదాలు...
రోజూ వాడాకలి తీర్చండి
అని చెప్పేందుకు మాటిమ్మని
రోజూ ఆ దేవుడ్ని ప్రార్థిస్తూనే ఉంది...

సీన్ : 6
--------
ఇప్పటికీ ఆ మనిషిక్కడే ఉన్నాడు,
అప్పుడు ఊరి బైట!
ఇప్పుడు గుడి బైట!
కాకపోతే
ఇప్పుడేదన్నా చెప్పుకునేందుకు!
పక్కన ఆ రాయిలేదు!
అదిగుర్తొచ్చి గుడ్లోకి
పోయేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ,,
వాడికి దేవుడు పూనాడంటూ
హుండీల్నింపుకుంటున్నారు!
తన అకలి మాత్రం ఇంకా అలానే ఉంది !
మనబుర్రల్లో............................. అజ్ఞానంలా!!!

Tuesday, January 29, 2013

Save as


ఇంకెన్నాళ్ళు???
అంతః ప్రవాహ అంతిమ చిత్రం!
ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు,
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

సమాజానికో అద్దం ఇచ్చి,
క్షణక్షణానికి రంగులు మార్చి,
ముందున్నప్పుడు వెనుకకు చూపి,
వెనకున్నప్పుడు ముందుకు చూపి,
ముందు వెనుకలకు మధ్యన పెట్టి,
తడికలు చుట్టి గంతలు కట్టి,
నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

నీది కాని నీ తనువుని చూస్తూ,
తడబడి పోతూ,
తమకపు కన్నులు చప్పుడు చేస్తూ..
తప్పులుచేస్తూ తిప్పలుపడుతూ..
క్రొద్దిసేపేమో కన్నీరంటావ్,
క్రొద్దిసేపేమో పన్నీరంటావ్,
కన్నీటిలోన పన్నీరు కలిపి
తప్పక ముందుకు సాగిపోతున్న,
తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది!
బ్రతుకు బండిపై ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని,
బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ...
నన్నే చూస్తూ నిన్నే తిడుతూ,
నీకూ-నాకూ గొడవలు పెడుతూ,
కడుపులు కొడుతూ,
కలుపుని తింటూ...
తప్పులు చేస్తూ ముందుకు సాగే,
వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!
నీది కాని నీ తనువుని మోస్తూ,
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!