Friday, August 26, 2011

"ఇదీ నా దేశం తీరు!!!"


"ఇదీ నా దేశం తీరు,
 ఆశల పల్లకిలో ఊరేగే,
 మధ్యతరగతి మహారాజుల వైభవం!
 మాటల గారడీ,
 మోసాలతో బురిడీ,
 అయినా మారదు ఓటును అమ్ముకునే,
 ఓటు వ్యభిచారుల ఒరవడి.
 ఇదీ నా దేశం తీరు!


 అధికారం పసలేదు,
 రాజకీయం విలువలేదు,
 ధనదాహం తీరిపోదు,
 కుటిలనీతి మారిపోదు
 పెదవులపై ధరహాసం,
 మనసు నిండా కల్మషం.
 ఇదీ నా దేశం తీరు!


 కళ్ళుండీ చూడలేని,
 కసిలేని జనాలు,
 బొంకంతా బయట పడినా,
 సిగ్గుపడని నాయకులు.
 విలువలకు అర్థం తెలియదు,
 రాజ్యాంగం భావం పట్టదు,
 అభ్యుదయం పై ఆసక్తే లేదు,
 ఇదీ నా దేశం తీరు!
 ప్రతి మనిషినీ కబలించిన కరుణలేని ధనదాహం!"





Thursday, August 25, 2011

"చెలి రావా!"



"కవితలను వ్రాసే తలపులను రేపి,
 వడివడిగా నాతో అడుగులు కలిపి,
 మేఘమై కమ్మేసినావు!
 నా మనసుపై నువు మత్తు చల్లి,
 కడలివై తడిపేసినావు!
 నీవే నిజమై,
 నీవు నా వశమై,
 కలలా నా చెంతకు రా!
 నను నడిపిస్తూ నా వెంటరా!"


"అద్దం! "



"కుడిని ఎడమగా చూపగలదేకానీ,
 లేనిది ఉన్నట్లు చూపలేని,
 నేటి సమాజంలోని నిజాయితీ కల ఒక సాధనం. 
 దీనికి,
 నీలోని లోపాల్ని దాచటం చేతకాదు!
 నీలోని సంతోషాన్ని ఆపటం వీలుకాదు!
 నిన్ను నిన్ను గా చూపుతుంది,
 అందంగా వున్న వాళ్ళు ముందున్నా,
 అందవిహీనమైన వాళ్ళు ముందున్నా,
 ఒకేలా ప్రతిస్పందించే సమానత్వ ప్రతీక ఇది.
 నీవంటే ఎంటో ఈ అద్దం మాత్రమే చెప్తుంది.
 ఒకసారి నిజాయితీగా యీ అద్దం ముందు నిలబడి,
 ఇప్పటి వరకు నువ్వేం చేసావో చెప్పు.
 మంచి చేస్తే నిన్ను నువ్వు చూసుకొని సంతోషించు,
 చెప్పుకోలేని పనులేమైనా చేస్తే ఇక,
 ఎప్పటికీ యీ అద్దం ముందుకు రాకు!
 ఒకవేళ వస్తే యీ అద్దం నిన్ను చూసి ఖచ్చితంగా అసహ్యించుకుంటుంది!"




ప్రత్యక్ష నరకం!



"చెప్పలేను ఈ బాధని,
 నీవులేని గుండె కోతని.
 ఎన్నాళ్ళిలా...ఆ 
 ఎన్నేళ్ళిలా...ఆ
 ఉండాలి ఒంటరి 'నేను'లా.....     ||చెప్పలేను ఇది||


 ఎడారిలో ఏకాకిలా వున్నాను నేనీ రోజు,
 ఏ శాపమొ వరమై వచ్చి,
 చిరునవ్వుని చిదిమేసింది!
 నను చేరిన వెలుగుని కసిగా,
 కన్నీటితొ తరిమేసిందీ!  ఈ...     ||చెప్పలేను ఇది||


 ప్రతిక్షణం నీ జ్ఞాపకం వెంటాడుతుంది నన్ను,
 ఈ...వేదన నను వెంటాడి,
 నరకానికి తరుముతువుంది!
 విసుగొచ్చిక నన్నేచేరి,
 నాలోనే కొలువయ్యిందీ...ఈ..     ||చెప్పలేను ఇది||" 



Wednesday, August 24, 2011

"వస్తున్నాడొసున్నాడొస్తున్నాడు.....జాగ్రత్త! "



"కొంటెతనం కోరలు చాచి ఆడతనాన్ని అల్లరి చేస్తే,
 అమ్మతనం ఆవేదన పడదా!
 నీ తల్లి సిగ్గు పడదా!
 ఆడదీ ఓ మనిషే! 
 తనదీ మనలాంటి మనసే!
 తాతలనాటి కట్టుబాట్లు,
 అమ్మమ్మల చీవాట్లు,
 ఆడపిల్లల్ని తమ ఇళ్ళలోనే బందీలుగా చేస్తే!
 ఆ ఇంటి ముంగిళి దాటి వచ్చి,
 ఈ ప్రపంచాన్ని పరవశంతో చూడటమే నేరమైపోతుంది!
 మానవత్వం నటిస్తూ...
 మన మధ్యనే తిరిగే,
 మనుషుల్ని నమ్మటమే పాపమైపోతుంది!
 ఉగ్గుపాలను పోసి,
 ఊసులే చెప్పి,
 కంటి రెప్పల్లే కాచి,
 కనుపాపలా చూచి,
 ఇన్నేళ్ళూ పెంచిన మాతృమూర్తి గుండెకోతను,
 ఎవరు మాణ్పగలరు?
 అడిగింది కాదనక,
 అల్లారు ముద్దుగా...
 తన గుండెల్లో దాచుకున్న,
 ఆ కన్నతండ్రి శోకాన్ని ఎవరాపగలరు?
 ఈ గాయాలిక జ్ఞాపకాలై పోవాలి!
 ఇలాంటి మానవ మృగాలను శిక్షించటానికి,
 నేను నమ్మిన దేవుడు కాలరుద్రుడై రావాలి!" 





Tuesday, August 23, 2011

సాగర గోష? అర్థం చేసుకునేందుకు ప్రయత్నించా!!!!!



"సాగరకెరటం చేసే పయనం,
 ఒదిదుడుకులతో సలిపెను సమరం!
 మండే ఎండకు ఆవిరి ఆయువు...
 మేఘమై సాగి చినుకులా మారి,
 అలలపై చేరి కెరటమై సాగు..
 అలుపెరగక చేసే నిత్య పోరాటం!
 పండు వెన్నెలలోన వెండి వెలుగులు చిమ్మి,
 సూర్యోదయాన పసిడి కాంతులను కలిగి,
 ఒడ్డుకు చేరి ఎన్ని కబురులను తెచ్చావు?
 తెలుసుకునేంతలో సమయమేలేనట్లు తిరిగెళ్ళిపోయావు!
 విరామమెరుగని పరుగు ఎందుకు నీకు?
 కోపమొస్తే నీవు ఉప్పెనౌతావు!
 నీ ఉప్పెనకు బలి అయిన వారి కుటుంబాల,
 కన్నీటిని మ్రింగి ఉప్పగుంటావు!
 ఎన్నెన్ని బాధలో నీ చలన గమనాన!
 ఎక్కెక్కి ఏడ్చావో ఇంతగా లోలోన!
 నీ పరుగునాపితే చినుకైనా రాలదు!
 నీ గుండెనిండా అంతా కన్నీరేనా?
 కించిత్ మంచినీటి జాడైనా కనిపించదెందుకని?
 నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయనుకొని...
 ఇదంతా నీ సంతోషమే నని భావించనా!
 ఏది ఏమైనా నీ అలుపెరుగని పరుగులకు ఇవే నా కృతజ్ఞతలు..." 


"మనమిద్దరం పాడుదాం ఈ పాటని!"



పల్లవై మారెగా.. నీ పలుకులే,
చరణమై చేరుతా వెనువెంటనె..
మనమిద్దరం పాడుదాం ఈ పాటని.
మన మనసుతో కూర్చుదాం సరిగమలని...   ||పల్లవై మారెగా||


తొలి చరణంలో చేర్చుదాము!
ఒక కలలాగ సాగిన పరిచయాన్ని.
ఆ పరిచయాన ఒకటల్లే మారిన,
మనసులు చెప్పిన మధుర భావనని. 
అంతులేని ఆ  సంతోషాలను,
ఏర్చి కూర్చి ఇక ఆపుదామిలా....         ||పల్లవై మారెగా||


మలి చరణంలో పొదుగుదాము,
మన ప్రేమలొ విరిసిన పరిమళాలను,
ఆ పరిమళాలతో కలసి ఇంతలా,
గుభాలించిన హృదయ స్పందనని.
మన తనువులు ఒకటై చేసిన,
అల్లరితోటి ముగింపునిచ్చేద్దాం చిరు సిగ్గుతో...   ||పల్లవై మారెగా||


"Love @ First Sight!"



"అదిగో ఆకాశాన అందాల తార!
 ఇదిగో నా ప్రక్కన ఆ వెలుగు జాడ!
 కన్నుల్లో వెన్నెలలు,
 నవ్వుల్లో సరిగమలు,
 నువు చూసే చూపుల్లో,
 మది మీటే భావాలు...                 ||అదిగో ఆకాశాన||


 తప్పస్సులెన్నన్ని చేసానో!
 యీ జన్మలో నిను చూసాను!
 మామూలు అమ్మాయి లానేనువ్వున్నా!
 ఆ నవ్వులో ఎదో గమ్మత్తు వుంది!
 యీ క్షణాలు ఇలానే,
 ఉండే వీలే లేదా...ఆ..?               ||అదిగో ఆకాశాన||

 కూర్చున్న చోటే శిలనైన!,
 ఏ మంత్రమేసావె చినదానా!
 ఇవ్వాళ నా గుండె గువ్వల్లె మారి,
 నా మాట విననంటు మారాము చేసి,
 నీ మనసే తన తోడంటూ,
 ఇక ననే వీడెనుగా...ఆ..                ||అదిగో ఆకాశాన||" 





Monday, August 22, 2011

"క్రొత్త తరాలను స్వాగతించేందుకు పచ్చదనాన్ని ఆహ్వానిద్దాం"





"నీవు నిలిచిన చోటుకైనా కొంత రక్షణనివ్వలేవా?
 నీవు పీల్చే గాలి సైతం ధరణి చేసిన దానమేగా!
 ఆకలంటే పండ్లనిచ్చెను!
 దాహమంటే నీటినిచ్చెను! 
 ప్రాణమంటే వాయువిచ్చెను!
 తనను తనివితీరా చూడమంటూ తిరగటానికి చోటునిచ్చెను!


 భగభగ మండే అగ్నిగోళమై,
 హృదయాంతరాలు సలసల కాగినా,
 ఉప్పెనలెన్నో ఉపద్రవాలై అణువణువునా..
 నిలువెల్లా గాయాలే చేసినా!
 పచ్చదనాన్ని తనపై కప్పి,
 తన బాధలనంతా గతమని మరచి,
 తరంతరంగా నిరంతరంగా...
 సాగే యీ తన పయణంలోన...
 ఈ పుడమితల్లి పాలు త్రాగుతూ,
 తన రొమ్ములనే తంతున్నాము!
 ఖనిజాలంటూ కుళ్ళబొడుస్తూ,
 తన రక్తాన్నంతా తోడుతున్నాము.
 ఇన్ని బాధలకంటూ ఓ కన్నీటిని కార్చితే,
 సునామి అంటూ పరిగెడుతాము,
 తన బాధనంతా దిగమ్రింగి ఓ చిన్న నిట్టూర్పునే వదిలితే,
 టోర్నడోలంటూ బయపడుతాము.
 చివరికి! కనికరించని భూమాతంటూ శాపనార్థాలు పెట్టేస్తాము!


 ఇప్పటికేమీ మించిపోలేదు!
 అలా అని ఊరుకునేందుకు సమయమూలేదు!
 కనిపించని ఆ దేవుని రూపం,
 ఈ భూమాతని ఎరుగు!
 నీ తప్పులకంటూ ఓ మొక్కని నాటితె,
 అది ఇచ్చే వాయువు నీ ప్రాణం విలువ!
 పురిటి నెప్పులు రోజూ పడుతూ,
 మన పాపాన్నంతా కడుపున దాస్తూ,
 ఇంకా ఎన్నాళ్ళని భరిస్తుందో!


 ప్రేమగా చూస్తే ప్రశాంతతనిస్తుంది,
 కాదని ఇదేతప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే,
 సమస్త ప్రాణకోటికే మరణఘంటికలు మ్రోగిస్తుంది ఖబడ్ధార్!!! "


Sunday, August 21, 2011

"మానవ ధర్మం!"


"కనురెప్పల మాటున కొలువైన కన్నీటిని,
 ఎన్నాళ్ళని ఆపి ఇలా ఆవేదన పడతావు?
 వెలుగులో చీకటిని చూస్తూ,
 చీకటి దారుల్లో పరుగులు తీస్తూ...
 చెలిమి చిరునామాలు చెరుపుకుంటూ,
 కాల గమనంలో నలిగిపోతూ...
 మనసుని కొలిమిగా మార్చుకొని,
 హృదయాన్ని రాతిలా మలచుకొని,
 గతానికి సమిథలా మారుతావా?
 భవిష్యత్ అంతా మైనమై కరిగిపోతావా?
 ఆశ-నిరాశల మధ్య పావులా మారినా!
 గతజన్మ పాపాలకంటూ ఇలా బందీ అయినా!
 విధి ఆడే వింత నాటకంలో...
 ఇవికూడా ఊహించని మలుపులే!
 కన్నీటి స్నేహాన్ని, కష్టాల చెలిమినీ మరచిపో...
 విచ్చుకొనే పూల పరవశాలను,
 ఎగిసిపడే అలల అల్లరి ఆటలను,
 మేఘాల మాటున ఆ చందమామ దోబూచులాటలను,
 మనసుతో చూడు...
 అడుగడుగునా ఆటంకాలే!
 అయినా పరిగెట్టాలనే ఆరాటాలే!
 ఇదే జీవితం! ఇదేమిటని ఆలోచించటం అవివేకం!
 కష్టసుఖాలతో మమేకమైపోవటమే మన ధర్మం.
 మానవ ధర్మం!"

ఇట్లు.....మీ నాన్న!



నా కవితాభిమాన స్నేహితుడు గవిరెడ్డి వెంకటరమణ కోరికపై వ్రాసిన కవిత ఇది...


"నీవు నీవేనా రా చిట్టికన్నా?
 లేక మా ఇద్దరి ప్రేమను కలుపుకొని,
 మైమరపించే నవ్వులతో మా ముందుకొచ్చిన వరాల మూటవా?
 నీ అల్లరిలో నా పసితనం ఉంది!
 నీ రూపంలో మీ అమ్మ సుకుమారముంది!
 నీ చిరాకులో మా నిర్లక్ష్యం కనిపిస్తుంది.
 ఆ బోసి నవ్వులలో మా ప్రేమ కనిపిస్తుంది.
 నీ సంజ్ఞల భాష మాకు అర్థంకాదు,
 కానీ దాని మరమార్థాన్ని మాత్రం అర్థమయ్యేలా ప్రవర్తిస్తావు.
 నీకు మాటలు రావని ఎవరన్నారు?
 వాటిని అర్థం చేసుకొనే పరిజ్ఞామే మాకు లేదురా!
 మేము కనబడకపోతే నీలో కనిపించే ఆరాటం!
 కనపడిన వెంటనే నీ మోమున మెరిసే వెన్నెల...
 ఎన్ని సార్లు చూసినా తనివి తీరదురా బుజ్జి తల్లీ...
 నీ రాకతో మా జీవితాలలో సంతోషాన్ని నింపావు.
 ఈ ఆనందం నిండు నూరేళ్ళూ ఇలానే వుండేలా చూడమని,
 ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ.......
         మా గారాల పట్టి "కుసుమాంజలి"కి ఇదే నా కవితాంజలి...

                      ఇట్లు,
                      మీ నాన్న.  "



"అనగనగనగా!"





"చేజారిన సంతోషపు ఆనవాళ్ళు వెదికేందుకు,
 వీలు ఇప్పుడు దొరికింది!
 బాధ్యతలు వదిలివేసి,
 వయసుని ఇక సగంచేసి,
 కరిగిన కాలంలో కలలా చేరే,
 వీలుందంటే మా జోరుకు మళ్ళీ ప్రాణం వస్తుంది!
 .
 .
 .
 అందాల వెంట పరుగులు,
 చుర చుర చూపుల పలకరింపులు,
 ఆటలు,స్నేహితులతో ఆటవిడుపులు,
 అమ్మాయిల పరిచయం కోసం పడే పాట్లు.
 పుస్తకాలకు సెలవిచ్చి,
 పుత్తడి బొమ్మల్ని చదువుతుంటే,
 ప్రతి పేజీ మిస్టరీనే!
    అంతులేని హిస్టరీనే!
 దిశా నిర్దేశం లేదు,
   లక్ష్యం అసలే లేదు.
 ఇప్పుడొక్కసారి ఆలోచిస్తే!
 ఆ చిలిపితనపు సవ్వడిని చేయాలన్నా చేయలేని ఒంటరితనం.
 ప్రతిరోజూ ఆవిరైపోయే అసహజత్వం.
 .
 . 
 .
 జీవితంలో అవి తిరిగి రాని రోజులు!
 అందుకే... ఎన్నటికీ మరపురాని మధుర స్మృతులు..."