Wednesday, June 5, 2013

హతోస్మి



1
నేనివేళ నవ్వగల్గుతున్నాను

చిన్నప్పటి మా ఇంటి

చిన్నగది చిన్నబోయేలా నవ్వగల్గుతున్నాను!!!



చెప్పులకు డబ్బులడిగితే

నాన్నెక్కడ తిడుతాడోనని

చిల్లుబడ్డ చెప్పులోంచి బాల్యాన్ని కాల్చుకున్న

రోజులు సిగ్గుపడేలా నవ్వుతున్నాను!!!!



ఇరుకు సందుల్లో నలిగిన

నా పసితనం గుర్తుకు తెచ్చుకు మరీ నవ్వగల్గుతున్నాను...



నవ్వుతున్నాను

నవ్వుతున్నాను

నవ్వుతూనే ఉన్నాను....

ఎంతవరకు నవ్వానంటే..

రాజసౌధం లాంటి కొత్తింటి కిటికీ తీసి

ఎదురుగా కనబడ్డ చెట్టు క్రింద

నిన్నటికీ - రేపటి మధ్య ఇరుక్కు పోయిన

చిల్లుల బట్టల్లోని అరవైఐదేళ్ళ అసహాయత

నిస్సహాయపు చూపులు నాలో ఇంకేదో వెతుకుతున్నాయని

నాకర్దమయ్యేంత వరకూ నవ్వాను....

అతిధులందరూ వచ్చారు ఇక మీరూ రండని

నా శ్రీమతి అనుండకపోతో ఆ వృద్దుని

చూపుల అగాదాల్లో అంతర్దానమైపోదునేమో!!!!



2
పదిహేనేళ్ళు గడిచిపోయాయి...

ఇప్పుడు సినీవినీలాకాశంలో నేనో పెద్ద స్టార్ ని...

ఈ పదిహేనేళ్ళలో రోజెప్పుడు మొదలైందో

నేనెక్కడ ఆగానో తెలియని పరుగు...

ఇంతపరుగులోనూ

నన్ను కట్టిపడేసే ఆ చూపులు

ఇల్లు దాటి వెళ్ళేప్పుడు

కారు అద్దాలు దాటి మరీ నన్ను శోధించాయి!!!

తన మెలుకువ చూపులకు

చిక్కకుండా పోవడమన్నది ఏ ఒక్కసారీ జరగలేదు!!!



నా ఈ సినీ ప్రయాణంలో

నా పేరున సేవా సంఘాలు

సామాజిక కార్యక్రమాలు

నాలో మానవీవకోణాన్ని ఆవిష్కరిస్తే..

సినీ జీవితం పేరు ప్రఖ్యాతులను

రాజకీయరంగం మంత్రి పదవిని కట్టబెట్టింది



3
ఈ రోజే ప్రమాణ స్వీకారం...

నన్నిన్ని రోజులు సోదించిన చూపులకు

సమాధానం దొరికిందో లేదో నని తెలుసుకోవాలనిపించి

నన్ను అభినందించేందుకొచ్చిన అశేష జనవాహిని మధ్య నుండి

మాసిన బట్టలలో రోజులు లెక్కించే వృద్దాప్యానికీ నాకు

మధ్య దూరం ఇంతదగ్గరగా ఉందని తెలుసుకునేందుకు నాకు

పదిహేనేళ్ళు పట్టిందని తెలుసుకొని సిగ్గుపడ్డా!!!



నేనీ ఇంటికొచ్చి పదిహేనేళ్ళయింది...

నే కనిపిచ్చినప్పుడల్లా నాలో నువ్వేదో వెదికేవాడివి...

ఏమిటది???

తన పెదాలు కదులుతున్నాయి...

శక్తినంతా కూడదీసుకొని

ఒక్కో మాట కి తనకు మిగిలిన ఆయుష్షు పోస్తూ

ఇ న్నా ళ్ళు గా.... నే  నీలో ...వె తి కిం ది...

మ............ని.........షి..........ని....... 
.
.
.
.
తన ఈ  సమాధానం విని చూసేందుకొచ్చిన

నా తొలి కన్నీటి బొట్టుతన దేహాన్ని  ముద్దాడేంతలోనే

ఆ చివరి మాట పూర్తైన

క్షణం తరువాతి తను - క్షణం ముందటి నేను

ఒక్కసారిగా చచ్చిపోయాం!!!!!!!!
 

.