Wednesday, June 19, 2024
కాంక్రీట్ జంగిల్ లో ఇరుకు గదుల్లో,
కుచించుకుపోయిన మనసులతో...
మనుషులు బ్రతికేస్తున్నారన్న విషయం మనకే కాదు!
ఊరవతల పూరిగుడిసెలో మట్టి వాసనలతో..
పరిమళిస్తున్న శీను గాడికీ తెలుసు!
ఎందుకంటే పూరిగుడిసెల్లో,
పేదరికం చాలా పద్ధతిగా ఉంటుంది.
హద్దుల్లో ఆశలు...గురిగీల్లో డబ్బులు,
గుండెల్లో బాధలు...తడి చీర కొంగులు!
తెల్లవారితే ఏదీ మారిపోదని తెలుసు,
కానీ ఉదయాన్నే తలుపు తెరుస్తుంటే..
ఏదో ఆశ శీను గాడికి,
ఆ ఇంటి గడప దాటిన వెలుగు...
నా జీవితంలోకి ఎప్పుడు వస్తుందోనని!
ఓనాడు ఆ ఇంటి తలుపు తెరుచుకోలేదు,
ఆ పూరి గుడిసె ఊపిరి పీల్చుకోనూలేదు,
మట్టి వాసన మాయమైపోయింది!
శీనుగాడు చూసిన వెలుగు ఎప్పుడూ....
తన జీవితంలోకి రాలేదు గాని!
తన జీవితం ఇప్పుడు...
నాలుగు కట్టెల మీద వెలిగిపోతూవుంది!
జీవితం అంటే ఇంతే....
రాలినంతనే రంగులు మారే బతుకులు మనవి!
అయినా ఎందుకో మనిషికి ఈ.... తీరని ఆశ!
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment